‘ఛోటా భీమ్’కు పదేళ్లు..ఆ విజయ గాధకు వెయ్యేళ్లు

‘ఛోటా భీమ్’ని తెలియని పిల్లలు లేరంటే అతిశయోక్తి కాదు. ఛోటా బీమ్ ని అనుకరిస్తూ పిల్లలు బిహేవ్ చేస్తూ మాట్లాడుతూంటే ముద్దువస్తుంది. ఛోటా భీమ్ పాత్ర వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ప్రపంచంలో చాలా ప్రాంతాలలో ప్రాచుర్యం పొందింది . ఈ క్యారక్టర్ బుల్లితెరపై మెగా సంచలనం. చిన్నారుల క్రేజీహీరో ఛోటా భీమ్ రీసెంట్ గానే పదవ సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఛోటా భీమ్‌ను ప్రతివారం 4 కోట్ల మంది చిన్నారులు వీక్షిస్తుండటం విశేషం. ఇంతకీ ఛోటా భీమ్ పాత్ర ఎలా పుట్టింది. ఎవరు ఈ ఆవిష్కరణ చేసారు…అంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మన కళ్ల ఎదురుగా కనిపిస్తాయి. అవి ప్రేరణగా నిలుస్తాయి. ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక. రామ్ చిలక ఆలోచనల్లోంచి ఛోటా భీమ్ పాత్ర 2003 సెప్టెంబర్ 18న పుట్టింది. ఛోటాభీమ్ ఆయన ఆలోచనల్లోంచి బుల్లితెరపైకి వచ్చేంత వరకు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. కానీ ఛోటా బీమ్ సృష్టి కర్తది మామూలు పట్టుదలకాదు.. అకుంఠితమైన ఆత్మవిశ్వాసంతో అన్ని ఆటంకాలను అధిగమించి, విజయపథంలో దూసుకుపోయే మనస్తత్వం. డ్రీమ్, ఐడియా, క్రియేటివిటీ, మార్కెటింగ్, కరేజ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అచీవ్‌మెంట్ అన్నీ ఆయన విజయగాధలో ఉన్నాయి.
మొదట ఛోటా భీమ్ దాని చుట్టూ కథ అల్లుకుని, పైలట్ ప్రాజెక్టు చేసేసరికి ఆరు నెలలు పట్టింది. నచ్చకపోవడంతో మరో ఏడాది శ్రమించి రీడిజైన్ చేశారు. తర్వాత 2005లో కార్టూన్ నెట్‌వర్క్, డిస్నీ వంటి అన్ని చానల్స్‌కూ చూపించారు. ఇండియన్ మార్కెట్‌లో నడవదని వాళ్లు రిజెక్ట్ చేశారు. మరికొన్ని మార్పులతో తిరిగి ప్రెజెంట్ చేసినా, ‘నో’ అనేశారు. స్టోరీ టెల్లింగ్‌లో ఇంకొన్ని మార్పులు చేసి అప్రోచ్ అయితే ‘పోగో’ ఛానల్ ఓకే చేసింది. వాళ్లకొచ్చిన ఆర్డర్‌తో కొత్త ఆఫీసు తీసుకున్నారు. ‘ఛోటా భీమ్’ మరో పదిరోజుల్లోగా పోగో చానల్‌లో కనిపిస్తుందనగా, 2008 మార్చి 26 అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. ఛోటా భీమ్ సక్సెస్‌ను కళ్లారా చూసుకోక ముందే అంతా బూడిదైంది. అప్పుల భయపెట్టాయి. అయినా తమ బుర్రల్లో ఉన్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చెక్కుచెదరలేదు కదా అనే ఆశ వాళ్లని ముందుకు నడిపింది.
ఆ తర్వాత అప్పుల వాళ్లందరినీ పిలిచి జరిగింది చెప్పారు రామ్ చిలక. మరో మూడు నెలలు టైమిస్తే అణాపైసలతో సహా అప్పంతా తీర్చేస్తానన్నాని నిజాయితీగా హామీ ఇచ్చారు. అయితే, అప్పటి వరకు ఇంకొంచెం మెటీరియల్ సప్లయ్ చేయమని అడిగారు. పదిరోజుల్లో టెలికాస్ట్ కాబోయే ‘ఛోటాభీమ్’ గురించి చెప్పి వాళ్లను కన్విన్స్ చేసి నమ్మించారు. ఫైనల్ గా ఛోటాభీమ్ స్క్రీన్‌పైకి వచ్చింది. అనుకోని రేంజ్‌లో హిట్ అయింది. అనుకున్న సమయానికే అప్పులన్నీ తీరిపోయాయి. ఆర్డర్స్ వచ్చిపడ్డాయి. ఆ తర్వాత ఆయన్ను ప్రపంచం గుర్తించింది. అమెరికాలోని అకాడమీ ఆఫ్‌ ఆర్డ్‌ యూనివర్సిటీ.. గ్రీన్‌గోల్డ్‌ యానిమేషన్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చిలకాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరిం చింది. భారతీయ యానిమేషన్‌ రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ విశ్వవిద్యాలయం రాజీవ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో రాజీవ్‌కు అకాడమీ ఆఫ్‌ ఆర్డ్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ ఎలీసా స్టీఫెన్స్‌ ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.