పిల్లల పెంపకం అనేది అంత సులువైన విషయం కాదు. పిల్లలను ఎలా ప్రేమించాలి? వాళ్లకు భద్రమైన వాతావరణం ఎలా కల్పించాలి?ఎంత మంచి చదువు చెప్పించాలి.. అని ఆలోచిస్తారే కానీ, వాళ్లు ఈ సమాజంలో బ్రతకటానికి వెయ్యాల్సిన పునాదులు వెయ్యము. వాళ్లకు డబ్బు విలువ, వస్తువు విలువ, కష్టం తెలియచెప్పాలని చూడము. పెద్దయ్యాక వాళ్లే నేర్చుకుంటారులే అనే ధోరణిలో వదిలేస్తాము. కానీ వాటికి భిన్నంగా ఆలోచిస్తున్నారు ఈ కాలం తల్లితండ్రులు. ఏది మంచి..ఏది చెడు అన్నది పిల్లలకు చిన్నపటి నుండే చెప్పాలని.. పిల్లలు స్వతంత్రంగా, విలువలతో ఉండేలా చేయూతనివ్వాలని ప్రయత్నిస్తున్నారు. చేస్తున్న పని పట్ల గౌరవం, పూర్తి ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఎదిగేలా చెయ్యటం తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుందని నమ్ముతున్నారు. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించి గుడ్ పేరెంట్స్ గా మారొచ్చని, పిల్లలకు అందమైన భవిష్యత్ ను కానుకగా ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
ముందుకంటే ఇప్పుడు లింగభేదం విషయంలో అందరి ప్రవర్తనా మారింది. ఆడ, మగ ఇద్దరూ సమానమే అని తెలుసుకుని ఆ విధంగానే పిల్లల్నీ పెంచుతున్నారు. ఇదే వారు కూడా భవిష్యత్‌లోనూ అమలు చేస్తారు.పిల్లల్ని గారాబం చేయాలి. అంతేకానీ, వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయాలనే ఆకాంక్షతో … శ్రీకాంత్ గారు తమ పిల్లలకు చదువుతో పాటు బయిట సమాజంలో ఎలా గౌరవంగా బ్రతకాలి, కష్టంతో కూడిన సంపాదనపై ఆసక్తి ఎలా పెంచాలి అనే ధోరణిని కలిగించాలని చిన్న ప్రయత్నం చేసారు. మూడో తరగతి చదువుతున్న తమ పిల్లలు శ్రీవల్లి, దేవసేనల చేత ఖాళీ సమయాల్లో LED COPPER LIGHTS తయారు చేయించారు. సీసాలు సేకరించటం, బ్యాటరీలు, లైట్లు తెచ్చుకుని ఇలా అందంగా తయారు చేయటం నేర్పించారు. ఆ తర్వాత తమ ప్లాట్ లో జరిగే దసరా కార్యక్రమాల్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసి వారి చేత స్వయంగా అమ్మించారు. ఎంతో ఉత్సాహంగా పిల్లలు తమ స్టాల్ దగ్గరకు వచ్చిన వారితో బేరసారాలు కొనసాగించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మొత్తానికి లైట్స్ అన్ని అమ్మేసి మూడు వేల ఐదు వందల రూపాయలు సంపాదించారు. అది వారికి ఎంతో సంతోషంగా కలిగించింది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే తాము స్వయంగా సంపాదించుకున్నసొమ్ము అది.
ఇలా పిల్లలలో ఉన్నా టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చెయ్యాలి. ప్రతీ చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. పేరెంట్స్ దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒక వేళ అలాంటివేం పిల్లల్లో మనం గుర్తించకపోతే.. వారికి ఏం ఇష్టమో.. తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఇదే వారి భవిష్యత్‌కి పునాది అవుతుంది.అంతేగాని మన ఇష్టాలని వాళ్లపై రుద్దకూడదు. పిల్లలకి చక్కని విద్య అందించడమనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో.. తల్లిదండ్రులు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే బాధ్యత కూడా అంతే ఉంటుంది. అదే విషయం పేరెంట్స్ గుర్తుపెట్టుకుని అందుకు తగ్గ చక్కని వాతావరణం కలిగించాలి. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైనా పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలంటున్నారు సైకాలజిస్ట్ లు. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉంటుంది .. ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం నేర్పుతుంది. అప్పుడే పిల్లల భవిష్యత్ కూడా బాగుంటుంది.